• 2 days ago
Koil Alwar Tirumanjanam in Vontimitta: ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్​స్పెక్టర్​ న‌వీన్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Category

🗞
News

Recommended