• 6 years ago
Actress Bhanu Priya’s ex-husband Adarsh Kaushal lost life recently in the US.Adarsh, who had been living in the US for the last several years reportedly suffered a cardiac arrest.

ఒకప్పటి అందాల నటి భానుప్రియ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో అమెరికాలో మృతిచెందారు. కౌశల్ మృతి వార్త విని భానుప్రియ షాక్‌కు గురైనట్లు సమాచారం. ఆ వెంటనే కుమార్తెను తీసుకుని ఆమె అమెరికా బయలుదేరి వెళ్లారు.
వృత్తిపరంగా ఆదర్శ్ కౌశల్ ఒక ఫోటోగ్రాఫర్. 1998, జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలో భానుప్రియను ఆయన వివాహం చేసుకున్నారు. అక్కడి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వీరి వివాహం జరిగింది.
ఆదర్శ్ కౌశల్-భానుప్రియల దాంపత్యానికి గుర్తుగా 2003లో వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఇద్దరూ కళా రంగాలకు చెందినవారే కావడం.. కళారంగం పట్ల అమితమైన అభిమానం ఉండటంతో కుమార్తెకు 'అభినయ' అని పేరు పెట్టుకున్నారు.
కుమార్తె పుట్టిన తర్వాత ఆదర్శ్ కౌశల్-భానుప్రియల వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత రెండేళ్లకే 2005లో భానుప్రియ ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.
భర్తతో విడాకుల అనంతరం భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేశారు. అప్పటినుంచి కుమార్తెతో పాటు చెన్నైలోనే ఉంటూ.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. అడపాదడపా తెలుగు సినిమాల్లోనూ కనిపించారు. అలాగే కూచిపూడి, భరతనాట్యం వంటి కళానృత్యాల్లో చాలామందికి శిక్షణ ఇస్తున్నారు.
అందం, అభినయానికి తోడు సాంప్రదాయ కళానృత్యాల్లో భానుప్రియకు ఉన్న నైపుణ్యం ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. వంశీ సినిమాల ద్వారా తెలుగునాట భానుప్రియ ముద్ర చాలామంది గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. తెరపై ఆమె నవ్వినా.. కళ్లతోనే హావభావాలు పలికించినా.. ప్రేక్షకులు మైమరిచిపోయారు. రూపలావణ్యానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే భానుప్రియను తెరపై చూడటం ఆరోజుల్లో గొప్ప అనుభూతి అనుభూతి అని ఇప్పటికీ చాలామంది గుర్తుచేసుకుంటారు.

Recommended