రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకోవడంతో బీజేపీలో జోష్ పెరిగింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ట్రాయంగిల్ పోటీని ఎదుర్కొన్న కాషాయం పార్టీ 8 అసెంబ్లీ స్థానాలను, 8 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జరిగిన ఎమ్మెల్సీ పోరులో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండు బీజేపీ ఖాతాలో పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని చట్ట సభల్లో కాషాయ పార్టీకి పది మంది సంఖ్యా బలం అంటే రెండు అంకెల స్కోరు కు చేరడం విశేషం. ఓవరాల్ గా 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఆరుగురు ఎంపీలు, ఒక రాజ్య సభ సభ్యుడు , తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీల బలం బీజేపీది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో కమలం పార్టీ ఉత్తర తెలంగాణలో తన బలాన్ని సుస్థిరం చేసుకుందనే చెప్పాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల నాధులు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బరిలోకి దిగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క స్థానం గెలవలేకపోయింది. బీఆర్ఎస్ కు తమ విజయాలతో చెక్ పెట్టడం ద్వారా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెప్పుకునే పరిస్థితి కల్పించారు. స్థానిక సంస్థల్లోను కమలంను వికసింపజేస్తే ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అధికార పీఠమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే కేంద్రంలోని ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు వ్యూహాలు రచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త సారధి నియమితుడవుతాడని కమలం సీనియర్లు చెబుతున్నారు. ఈ విజయం ఇచ్చిన జోష్ తో రానున్న రోజుల్లో బీజేపీ అధికార పీఠం దక్కించుకునే దిశగా సాగుతుందని చెప్పక తప్పదు.
Category
🗞
News