అఫిడవిట్ పై ఏపీ కాబినెట్ మీటింగ్

  • 6 years ago
Amaravati: AP Cabinet is going to Meet today to discuss on affidavit filed by central government in supreme court. As the elections are coming closer, every cabinet meeting is likely to make key decisions.
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు అంతకంతకూ సమీపిస్తున్న ఈ తరుణంలో ఇక ప్రతి కేబినెట్ భేటీ లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా సంక్షేమ, జనాకర్షక పధకాలకు సంబంధించిన ప్రకటనలు ఇకపై జరగబోయే ప్రతి మంత్రివర్గ సమావేశంలో వెలువడే అవకాశం ఉంది. నేటి కేబినెట్ భేటీ విషయానికొస్తే ఏపీకి విభజన చట్టంలో ఉన్నవి అన్నీ అమలు చేశామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగ భృతి మార్గదర్శకాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
ఏపీకి విభజన చట్టంలో ఉన్నవి అన్నీ అమలు చేశామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రులు, సీనియర్‌ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి అందిన సాయంపై సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై కూడా నేడు రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మరోవైపు కేంద్రం తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తాజా కేబినెట్‌ సమావేశం తరువాత నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుండో పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతి అంశంపై ఈ కేబినెట్‌లో కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల వాగ్దానంలో ముఖ్య భూమిక పోషించిన వాగ్దానం ఇది. గడచిన నాలుగేళ్లుగా ఈ పథకం అమలుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తోంది. అయితే, గడచిన మూడు నాలుగు నెలలుగా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పలు దఫాలుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ మరియు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, న్యాయ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పలుసార్లు అధికారులతో సమావేశమై విధివిధానాలు రూపొందించిన సంగతి విదితమే.