Beer Bottle Temple In Thailand థాయిలాండ్ లో బీర్ బాటిళ్ల గుడి

  • 6 years ago
this buddhist temple in thailand is made completely out of beer bottles

మనం గుడికెళ్తున్నప్పుడు ఎంతో నిష్టగా స్నానం చేసి వెళ్తాం. మద్యం తాగితే దాదాపు ఎవరూ కూడా గుడికి వెళ్లరు. దేవుడి విషయంలో మనం ఇంత నిష్ట పాటిస్తాం. ఇక భవనాలను, ఆలయాలను కట్టడానికి వేటిని ఉపయోగిస్తాం? ఎక్కడైనా ఇటుకల్నే ఉపయోగిస్తారు.. కొన్ని చోట్ల చెక్కలతో కడతారని అంటారా?
అయితే ఒకచోట ఏకంగా బీర్‌ బాటిళ్లతోనే గుడి కట్టారు. ఈ బీర్ టెంపుల్ థాయ్‌లాండ్‌ లో ఉంది. బీర్‌ బాటిళ్లతో బుద్ధుడి ఆలయాన్ని నిర్మించగా, బౌద్ధ సన్యాసులే స్వయంగా ఈ నిర్మాణంలో పాలుపంచుకోవటం గమనార్హం. "ఉపయోగించని సీసాలను మాకివ్వండి.. మేం మరిన్ని నిర్మాణాల్ని చేపడతాం" అనే నినాదంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు.
ఆ బీర్ ఆలయమే... ఖూన్‌ హన్‌ జిల్లా సిసాకెట్‌ ప్రొవిన్స్‌లోని ‘వాట్‌ పా మహా చెది కయూ' బుద్ధుడి ఆలయం. 1984లో సముద్ర ప్రాంతం వద్ద చెత్త సేకరణలో పాల్గొన్న కొందరు బౌద్ధ సన్యాసులు కుప్పులు కుప్పలుగా పడి ఉన్న బీర్‌ బాటిళ్లను గమనించారు. వెంటనే వారికి ఓ ఆలోచన తట్టింది.
ఇటుకలకు బదులుగా బీర్‌ బాటిళ్లతో అందంగా ఒక గుడిని రూపొందిస్తే బాగుంటుందనుకున్నారు. వెంటనే సుమారు 10 లక్షలకు పైగానే ఖాళీ బీర్‌ సీసాలను ఉపయోగించి గుడి నిర్మించారు. ఆలయ ప్రాంగణంతోపాటు, మెట్లు, నేల, వాష్‌రూమ్‌లు, విశ్రాంతి గది ఇలా అన్నీ బీర్‌ సీసాలతో నిర్మించినవే.
ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే ఆలయంలోని అనేక చిత్రవర్ణాలను, సీసాల బిరడాలతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బుద్ధుడి చిత్రాన్ని కూడా బీర్‌ బాటిళ్ల మూతలను రీ సైక్లింగ్‌ చేసి తయారు చేయటం విశేషం. ఈ బీర్ టెంపుల్ కు ఉపయోగించిన సీసాల్లో హైనకెన్‌, ఛాంగ్‌ అనే రెండు బీర్‌ కంపెనీలకు చెందినవే ఉన్నాయంట. ఈ బీర్‌ టెంపుల్‌ ద్వారా సిసాకెట్‌ పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతోంది.

Recommended