'హ్యాపీ సిటీస్' ఈవెంట్ కోసం రూ.50కోట్లు ఖర్చు పెట్టడమేంటి : జగన్

  • 6 years ago
On Wednesday, in Undavalli public meeting YSRCP President Jaganmohan Reddy alleged that CM Chandrababu Naidu is the don of Sand Mafia in state

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి నిప్పులు చెరిగారు. రాజధాని కోసం లంక భూముల్ని, అసైన్డ్‌ భూముల్ని బలవంతంగా లాక్కునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 134వ రోజు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం గ్రామాల్లో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని జగన్ ఆరోపించారు. ఈ ఇసుక దందాకు డాన్ ఎవరైనా ఉన్నారంటే.. అది సీఎం చంద్రబాబే అని ఆరోపించారు. సీఎం అంటే ప్రజల ఆస్తులు కాపాడేవాడా? దోచుకునే వాడా? అంటూ రైతులు అడుగుతున్నారని పేర్కొన్నారు.
ఓవైపు కేంద్రం నిదులు ఇవ్వడం లేదు.. రాష్ట్రం వద్ద డబ్బు లేదని చెబుతూనే 'హ్యాపీ సిటీస్' ఈవెంట్ కోసం రూ.50కోట్లు ఖర్చు పెట్టడమేంటని జనం ప్రశ్నిస్తున్నట్టుగా జగన్ ప్రస్తావించారు. ఇవాళ హోదా ఎండమావిగా తయారవ్వడానికి కారణం చంద్రబాబే అని మరోసారి ఆరోపించారు. చంద్రబాబు చిత్తశుద్ది ఉన్న పెద్ద మనిషి అయితే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి దీక్షకు కూర్చోబెట్టేవారని గుర్తుచేశారు.
జగన్ ఉండవల్లి సభలో ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది టీడీపీ నేతలు అలజడి రేపేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సుమారు 20 మందికిపైగా టీడీపీ యువకులు కోడిగుడ్లు, టమాటాలతో సభలో ప్రవేశించారని ఆరోపించారు. వారిని గుర్తించి పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది.

Recommended